|
||
| Previous | ||
| లేవీయకాండము 01 అధ్యాయము | ||
1 యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికీలాగు సెలవిచ్చెను. | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-విూలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలో నుండి గాని గొఱ్ఱెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసికొని రావలెను. | 3 అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన యెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను. | 4 అతడు దహనబలిగా అర్పించు పశువు తలవిూద తన చెయ్యి నుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. | 5 అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను. | 6 అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత | 7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము విూద అగ్నియుంచి ఆ అగ్ని విూద కట్టెలను చక్కగా పేర్చవలెను. | 8 అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము విూదనున్న అగ్నివిూద కట్టెలపైని చక్కగా పేర్చవలెను. | 9 దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము విూద దహింపవలెను. | 10 దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన యెడల అతడు నిర్దోష మైన మగదాని తీసికొని వచ్చి | 11 బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. | 12 దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము విూదనున్న అగ్ని విూది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. | 13 దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము విూద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము. | 14 అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైన యెడల తెల్లగువ్వలలో నుండిగాని పావురపు పిల్లలలో నుండిగాని తేవలెను. | 15 యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము విూద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. | 16 మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను. | 17 అతడు దాని రెక్కల సందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము విూద, అనగా అగ్ని విూది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. |
||
| Previous | ||