|
||
| Previous | ||
| నిర్గమకాండము 39 అధ్యాయము | ||
39 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. | 2 మరియు అతడు బంగారుతోను నీలధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను. | 3 నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి. | 4 దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను. | 5 దానివిూదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 6 మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటివిూద చెక్కబడెను. | 7 అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములవిూద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 8 మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారునిపనిగా పతకమును చేసెను. | 9 అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొగు జేనెడు వెడల్పు గలది. | 10 వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మకరతములుగల పంక్తి మొదటిది; | 11 పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది; | 12 గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడవది; | 13 రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతమునుగల పంక్తి నాలుగవది; వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. | 14 ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్ల చొప్పున, పన్నెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, పన్నెండు గోత్రముల పేళ్లు ఒక్కొక్క దానివిూద ఒక్కొక్క పేరు చెక్కబడెను. | 15 మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి. | 16 వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి | 17 అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో వేసి | 18 అల్లబడిన ఆ రెండు గొలు సుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజఖండములవిూద దాని యెదుట ఉంచిరి. | 19 మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి. | 20 మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. | 21 ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 22 మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను. | 23 అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను. | 24 మరియు వారు చొక్కాయి అంచులవిూద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. | 25 మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్ల మధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులవిూద చుట్టునున్న దానిమ్మపండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. | 26 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచుల విూద చుట్టు ఉంచిరి. | 27-29 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి. | 30 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలె దానివిూద - యెహోవా పరిశుద్ధుడు1 అను వ్రాత వ్రాసిరి. | 31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు విూదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. | 32 ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. | 33 అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటిని దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, | 34 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను, | 35 సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును, | 36 బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను, | 37 పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపము కొరకు తైలమును | 38 బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలాద్వారమునకు తెరను | 39 ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను | 40 ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవకొరకైన ఉపకరణమున్నిటిని, పరిశుద్ధ స్థలములోని | 41 యాజక సేవార్ధమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసికొని వచ్చిరి. | 42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. | 43 మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను. |
||
| Previous | ||