BLM
 

 
Previous
  నిర్గమకాండము 38 అధ్యాయము  

38 మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను. | 2 దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడి రేకు పొదిగించెను. | 3 అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటిని, అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను. | 4 ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను. | 5 మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను. | 6 ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను. | 7 ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. | 8 అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రు అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. | 9 మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను. | 10 వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. | 11 ఉత్తర దిక్కుననున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. | 12 పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. | 13 తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు; | 14 ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. | 15 అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరుప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు. | 16 ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి. | 17 స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను. | 18 ఆవరణ ద్వారపు తెర నీలధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు. | 19 వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి. | 20 వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను, వాటి పెండె బద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నియు ఇత్తడివి. | 21 మందిర పదార్ధముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్ధముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. | 22 యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. | 23 దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన ఆహోలీయాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడునై యుండెను. | 24 పరిశుద్ధస్థల విషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున నూట పదహారు మణుగుల ఐదువందలముప్పది తులములు. | 25 సమాజములో చేరినవారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు. | 26 ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందిలో తలకొకటికి అరతులము. | 27 ఆ నాలుగువందల వెండి మణుగులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను. | 28 వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దలచేత కట్టెను. | 29 మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు. | 30 అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటిని | 31 చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు మేకులన్నిటిని చేసెను.

Previous