BLM
 

 
Previous
  నిర్గమకాండము 37 అధ్యాయము  

37 మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర. | 2 లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను. | 3 దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను. | 4 మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి | 5 మందసమును మోయుటకు దాని ప్రక్కల విూది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను. | 6 మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర; | 7 మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను. | 8 ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలవిూద కెరూబులను చేసెను. | 9 ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. | 10 మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర. | 11 అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను; | 12 దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టు బంగారు జవను చేసెను. | 13 దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను. | 14 బల్లను మోయుటకు మోతకఱ్ఱలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సవిూపముగా నుండెను. | 15 బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. | 16 మరియు నతడు బల్లవిూదనుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. | 17 అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషిపనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. | 18 దీపవృక్షము యొక్క ఇరుప్రక్కలనుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి. | 19 ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవకొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను. | 20 మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదము రూపమైన నాలుగు కలశము లుండెను. | 21 దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. | 22 వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమై నవి; అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయబడెను. | 23 మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను. | 24 దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను. | 25 మరియు అతడు తుమ్మకఱ్ఱతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్మలు ఏకాండమైనవి. | 26 దానికి, అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను. | 27 దాని మోయు మోతకఱ్ఱలను స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను. | 28 దాని మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. | 29 అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.

Previous