BLM
 

 
Previous
  నిర్గమకాండము 36 అధ్యాయము  

36 పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును ఆహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. | 2 బెసలేలును ఆహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరిని మోషే పిలిపించెను. | 3 ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలము యొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషే యొద్దనుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. | 4 అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి | 5 మోషేతో-చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారముగా తీసికొని వచ్చుచున్నారని చెప్పగా | 6 మోషే-పరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకవిూదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది | 7 గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి. | 8 ఆ పనిచేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీలధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను. | 9 ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. | 10 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. | 11 మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. | 12 ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబది కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను. | 13 మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. | 14 మరియు మందిరమువిూద గుడారముగా మేకవెండ్రుకలతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగా చేసెను. | 15 ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు | 16 ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు; ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను. | 17 మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకు లను చేసెను. | 18 ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను. | 19 మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి విూదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. | 20 మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను. | 21 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర. | 22 ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మందిరముయొక్క పలకలన్నిటికి చేసెను. | 23 కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. | 24 ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను. | 25-26 మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను. | 27 పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను. | 28 వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను. | 29 అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను. | 30 ఎనిమిది పలక లుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను. | 31 మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకకు అయిదు అడ్డుకఱ్ఱలను | 32 మందిరము యొక్క రెండవప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను. | 33 పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను. | 34 ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను. | 35 మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డ తెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారుని పనియైన కెరూబులు గలదానిగా దాని చేసెను. | 36 దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను. | 37 మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డ తెరను చేసెను. | 38 దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.

Previous