|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 21 అధ్యాయము | ||
21 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడు నప్పుడు, వాని చంపిన వాడెవడో అది తెలియక యుండిన యెడల | 2 నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను. | 3 ఏ ఊరు ఆ శవమునకు సవిూపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని | 4 దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగ తియ్యవలెను. | 5 అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాటచేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను. | 6 అప్పుడు ఆ శవమునకు సవిూపమందున్న ఆ ఊరి పెద్దలందరు ఆ యేటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని | 7 -మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. | 8 యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము; నీ జనమైన ఇశ్రాయేలీయుల విూద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. | 9 అట్లు నీవు యెహోవా దృష్టికి యధార్ధమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు. | 10 నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత | 11 వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతియైన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసికొన మనస్సయి | 12 నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని | 13 గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ యింట నివసించి యొక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును. | 14 నీవు ఆమె వలన సంతుష్టినొందని యెడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు; నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు. | 15 ప్రేమింపబడునదొకతెయు ద్వేషింపబడునదొక తెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని | 16 జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన యెడల, తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. | 17 ద్వేషింపబడినదాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. | 18 ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన యెడల | 19 అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసికొని వచ్చి | 20 -మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడియున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్ప వలెను. | 21 అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు. | 22 మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానువిూద వ్రేలాడదీసిన యెడల | 23 అతని శవము రాత్రివేళ ఆ మ్రానివిూద నిలువకూడదు. వ్రేలాడ దీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. |
||
| Previous | ||