|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 22 అధ్యాయము | ||
22 నీ సహోదరుని యెద్దుగాని గొఱ్ఱెగాని త్రోవ తప్పిపోవుట చూచిన యెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. | 2 నీ సహోదరుడు నీ దగ్గర లేక పోయిన యెడలను, నీవు అతని నెరుగక పోయిన యెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను. నీ సహోద రుడు దాని వెదకుచు వచ్చువరకు అది నీ యొద్దనుండ వలెను, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను. | 3 అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు ఆలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టు కొనినది ఏదైనను నీకు దొరికిన యెడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి ఆలాగుననే చేయవలెను; నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. | 4 నీ సహోదరుని గాడిదగాని యెద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచిన యెడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను. | 5 స్త్రీ పురుష వేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు. | 6 గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టు విూదనే గాని నేలవిూదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడిన యెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న యెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును | 7 నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును. | 8 క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానివిూద నుండి యెవడైనను పడుట వలన నీ యింటివిూదికి హత్య దోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను. | 9 నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్షతోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. | 10 ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు. | 11 ఉన్నియు జనుపనారయు కలిపి నేసిన బట్టను వేసికొనకూడదు. | 12 నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను. | 13 ఒకడు స్త్రీని పెండ్లి చేసికొని ఆమెను కూడిన తరు వాత ఆమెను ఒల్లక ఆమెవిూద అవమాన క్రియలు మోపి | 14 ఆమె చెడ్డదని ప్రచురపరచి-ఈ స్త్రీని నేను పరిగ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల | 15 ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసికొని రావలెను. | 16 అప్పుడు ఆ చిన్నదాని తండ్రి - నా కుమార్తెను ఈ మనుష్యునికి పెండ్లిచేయగా | 17 ఇదిగో ఇతడీమె నొల్లక-నీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె విూద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను. | 18 అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధముగా వానియొద్ద తీసికొని | 19 ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు. | 20 అయితే ఆ మాట నిజమైన యెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడని యెడల | 21 వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రి యింట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును విూ మధ్యనుండి విూరు పరిహరించుదురు. | 22 ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలీయులలో నుండి పరిహరించుదురు. | 23 కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల | 24 ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసికొని వచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును విూలోనుండి పరిహరించుదురు. | 25 ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమినిపట్టి ఆమెతో శయనించిన యెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. | 26 ఆ చిన్నదానినేమియు చేయకూడదు, ఆ చిన్నదానియందు మరణ పాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగు వాని విూదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది. | 27 అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. | 28 ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల | 29 ఆమెతో శయనించినవాడు ఆ చిన్న దాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను అవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు. | 30 ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు. |
||
| Previous | ||