BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 13 అధ్యాయము  

13 ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్య లేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి | 2 నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన యెడల | 3 అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా విూరు విూ దేవుడైన యెహోవాను విూ పూర్ణ హృదయముతోను విూ పూర్ణాత్మతోను ప్రేమించు చున్నారో లేదో తెలిసికొనుటకు విూ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. | 4 విూరు విూ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. | 5 నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన విూ దేవుడైన యెహోవా విూద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. | 6 నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని | 7 భూమి యొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సవిూపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల | 8 వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. | 9 చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారివిూద పడవలెను. | 10 రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములో నుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. | 11 అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు. | 12 నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదోయొక దానియందు | 13 పనికిమాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, విూరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన యెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. | 14 అది నిజమైన యెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన యెడల | 15 ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. | 16 దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును. | 17 నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు | 18 నీ దేవుడైన యెహోవా దృష్టికి యధార్థమైన దాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్లుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.

Previous