11 కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడు గైకొనవలెను. | 2 నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని | 3 ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకు ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను | 4 ఆయన ఐగుప్తు దండునకును దాని గుఱ్ఱములకును రధములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్ర జలమును వారి విూద ప్రవహింపజేసిన దానిని | 5 యెహోవా నేటివరకు వారిని నశింపజేసిన రీతిని, విూరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో విూ కొరకు చేసిన దానిని | 6 రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొద్దనున్న సమస్త జీవరాసులను ఇశ్రాయేలీయులందరి మధ్యను మ్రింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయున్న విూ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి. | 7 యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు విూ కన్నులే చూచినవి గదా. | 8 విూరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొనునట్లును | 9 యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసెదనని విూ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున విూరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున విూకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని విూరు గైకొనవలెను. | 10 విూరు స్వాధీనపరచుకొనబోవు దేశము విూరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. | 11 విూరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలుగల దేశము. | 12 అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దానివిూద ఉండును.
13 కాబట్టి విూ పూర్ణహృదయముతోను విూ పూర్ణాత్మతోను విూ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను విూకిచ్చు ఆజ్ఞలను విూరు జాగ్రత్తగా వినిన యెడల | 14 విూ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. | 15 మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. | 16 విూ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ విూరు జాగ్రత్తపడుడి. | 17 లేని యెడల యెహోవా విూ విూద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా విూకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండ విూరు శీఘ్రముగా నశించెదరు. | 18 కాబట్టి విూరు ఈ నా మాటలను విూ హృదయములోను విూ మనస్సులోను ఉంచుకొని వాటిని విూ చేతుల విూద సూచనలుగా కట్టుకొనవలెను. అవి విూ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. | 19 నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని విూ పిల్లలకు నేర్పి | 20 నీ యింటి ద్వారబంధముల విూదను నీ గవునుల విూదను వాటిని వ్రాయవలెను. | 21 ఆలాగు చేసిన యెడల యెహోవా విూ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున విూ దినములును విూ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. | 22 విూరు విూ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, విూరు చేయవలెనని నేను విూకాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. | 23 అప్పుడు యెహోవా విూ యెదుట నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; విూరు విూకంటె బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. | 24 విూరు అడుగుపెట్టు ప్రతి స్థలము విూది అగును; అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీసు1 నది మొదలుకొని పడమటి సముద్రము వరకును విూ సరిహద్దు వ్యాపించును. | 25 ఏ మనుష్యుడును విూ యెదుట నిలువడు. తాను విూతో చెప్పినట్లు విూ దేవుడైన యెహోవా విూరు అడుగుపెట్టు దేశమంతటి విూద విూ బెదురు విూ భయము పుట్టించును. | 26 చూడుడి; నేడు నేను విూ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. | 27 నేడు నేను విూకాజ్ఞాపించు విూ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విూరు వినిన యెడల దీవెనయు, విూరు విూ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక | 28 నేడు నేను విూకాజ్ఞాపించు మార్గమును విడిచి విూరెరుగని యితర దేవతలను అనుసరించిన యెడల శాపమును విూకు కలుగును. 29 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండవిూద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండవిూద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. | 30 అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా. | 31 విూరు చేరి విూ దేవుడైన యెహోవా విూకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. విూరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు. | 32 అప్పుడు నేడు నేను విూకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని విూరు అనుసరించి గైకొనవలెను. 1. ఫరాతు. |