BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 9 అధ్యాయము  

9 ఇశ్రాయేలూ వినుము; నీ కంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములుగల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు. | 2 ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా. | 3 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. | 4 నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి వారిని తోలివేసిన తరువాత-నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు. | 5 నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యధార్ధతయైనను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ యెదుట నుండి వెళ్లగొట్టుచున్నాడు. | 6 విూరు లోబడనొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను. | 7 అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు విూరు ప్రవేశించు వరకు విూరు యెహోవా విూద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. | 8 హోరేబులో విూరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము విూ విూద తెచ్చుకొనెను. | 9 ఆ రాతిపలకలు, అనగా యెహోవా విూతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసికొనుటకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండవిూద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని. | 10 అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. విూరు కూడి వచ్చిన దినమున ఆ కొండవిూద అగ్ని మధ్యనుండి యెహోవా విూతో పలికిన వాక్యములన్నియు వాటి విూద ఉండెను. | 11 ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి | 12 -నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను. | 13 మరియు యెహోవా -నేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు | 14 నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహు జనముగా చేసెదనని నాతో చెప్పగా | 15 నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను. | 16 నేను చూచినప్పుడు విూరు విూ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా విూకాజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి యుంటిరి. | 17 అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని, నా రెండు చేతులలో నుండి విూ కన్నుల యెదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి | 18 విూరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన విూ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని | 19 ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. | 20 మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని విూద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. | 21 అప్పుడు విూరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని. | 22 మరియు విూరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. | 23 యెహోవా- విూరు వెళ్లి నేను విూకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలో నుండి మిమ్ము పంపి నప్పుడు విూరు విూ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటిమాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు. | 24 నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని విూరు యెహోవా విూద తిరుగుబాటు చేయుచున్నారు. | 25 కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవా -మిమ్మును నశింపజేసెదననగా | 26 నేను యెహోవాను ప్రార్ధించుచు ఈలాగు చెప్పితిని-ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్ధ్యమైన జనమును నశింపజేయకుము. | 27 నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసికొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము; | 28 ఏలయనగా నీవు ఏ దేశములో నుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు-యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలనను, వారిని ద్వేషించుట వలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో. | 29 నీవు నీ అధిక బలముచేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలును వీరే.

Previous