23 అప్పుడు బిలాము-ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. | 2 బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠము విూద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి. | 3 మరియు బిలాము బాలాకుతో- బలిపీఠము విూది నీ దహనబలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్ట యెక్కెను. | 4 దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు-నేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానివిూదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా, | 5 యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచి-నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను. | 6 అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలచియుండెను. | 7 అప్పుడు బిలాము ఉపమానరీతిగా ఇట్లనెను-
అరాము నుండి బాలాకు
తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి
-రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము
రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను
అనెను.
8 ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే
ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
9 మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను
కొండల నుండి అతని కనుగొనుచున్నాను
ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును
జనములలో లెక్కింపబడరు.
10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?
ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్క పెట్టగలరు?
నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.
నా అంత్యథ వారి అంతమువంటి దగును గాక
అనెను.
11 అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. | 12 అందుకతడు- యెహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలుకవద్దా? అని ఉత్తరమిచ్చెను. | 13 అప్పుడు బాలాకు-దయచేసి నాతో కూడ మరియొక చోటికి రమ్ము. అక్కడ నుండి వారిని చూడవచ్చును; వారి చివర మాత్రమే కనబడును గాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి | 14 పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము విూద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. | 15 అతడు-నీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, | 16 యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి - నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను. | 17 అతడు బాలాకునొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతని యొద్దనుండిరి. బాలాకు -యెహోవా యేమి చెప్పెనని అడుగగా | 18 బిలాము ఉపమానరీతిగా నిట్లనెను-
బాలాకూ, లేచి వినుము
సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆల కించుము
19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు
పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు
ఆయన చెప్పి చేయకుండునా?
ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
20 ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను
ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.
21 ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు
ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు
అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.
22 రాజు యొక్క జయధ్వని వారిలో నున్నది
దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను
గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.
23 నిజముగా యాకోబులో మంత్రము లేదు
ఇశ్రాయేలులో శకునము లేదు
ఆయా కాలములందు దేవుని కార్యములు
యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును.
24 ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును
అది సింహమువలె నిక్కి నిలుచును
అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. 25 అంతట బాలాకు-నీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా | 26 బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా | 27 బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. | 28 బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత | 29 బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. | 30 బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము విూద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. |