BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 22 అధ్యాయము  

22 తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. | 2 సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. | 3 జనము విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. | 4 మోయాబీయులు మిద్యాను పెద్దలతో -ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది; యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. | 5 కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను. -చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు. | 6 కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. | 7 కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా | 8 అతడు వారితో-యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి విూతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి. | 9 దేవుడు బిలామునొద్దకు వచ్చి-నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా | 10 బిలాము దేవునితో యిట్లనెను-సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు | 11 -చిత్తగించుము; ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను. | 12 అందుకు దేవుడు-నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను. | 13 కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో-విూరు విూ స్వదేశమునకు వెళ్లుడి; విూతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా | 14 మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి-బిలాము మాతో కూడ రానొల్లడాయెననిరి. | 15 అయినను బాలాకు వారి కంటె బహు ఘనత వహించిన మరి యెక్కువ మంది అధికారులను మరల పంపెను. | 16 వారు బిలామునొద్దకు వచ్చి అతనితో-నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము. | 17 నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. | 18 అందుకు బిలాము-బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట విూరలేను. | 19 కాబట్టి విూరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. | 20 ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి-ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. | 21 ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను. | 22 అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడ నుండిరి. | 23 యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా | 24 యెహోవా దూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను. | 25 గాడిద యెహోవా దూతను చూచి గోడవిూద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను. | 26 యెహోవా దూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకుచోటను నిలువగా | 27 గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను. | 28 అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక గనుక అది-నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా | 29 బిలాము-నీవు నా విూద తిరుగబడితివి; నా చేత ఖడ్గమున్న యెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. | 30 అందుకు గాడిద- నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు-లేదనెను. | 31 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా | 32 యెహోవా దూత-యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. | 33 ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుట నుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పెను. | 34 అందుకు బిలాము-నేను పాపము చేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా | 35 యెహోవా దూత-నీవు ఆ మనుష్యులతో కూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమియు పలుక కూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్లెను. | 36 బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా | 37 బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా. నా యొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్ధుడను కానా? అనెను. | 38 అందుకు బిలాము-ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిననేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. | 39 అప్పుడు బిలాము బాలాకుతో కూడ వెళ్లెను. వారు కిర్యత్‌ హుచ్చోతుకు వచ్చినప్పుడు | 40 బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారుల కును పంపెను. | 41 మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలు యొక్క ఉన్నత స్థలముల విూద నుండి జనులను చివర వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.

Previous