BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 19 అధ్యాయము  

19 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. | 2 - యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీ యొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము. | 3 విూరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను. | 4 యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను; | 5 అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. | 6 మరియు ఆ యాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. | 7 అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 8 దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. | 9 మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను; అది పాపపరిహారార్థబలి. | 10 ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. | 11 ఏ నరశవమునైనను ముట్టిన వాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును. | 12 అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసికొనని యెడల ఏడవ దినమున పవిత్రుడు కాడు. | 13 నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొనని యెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానివిూద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును. | 14 ఒకడు ఒక గుడారములో చచ్చిన యెడల దాని గూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములోనున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును. | 15 మూత వేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. | 16 బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టు వాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును. | 17 అప విత్రుని కొరకు వారు పాపపరిహారార్థమైన హోమభస్మములోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మము విూద ఒకడు పారు నీళ్లు పోయవలెను. | 18 తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారము విూదను దానిలోని సమస్తమైన ఉపకరణముల విూదను అక్కడనున్న మనుష్యుల విూదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునే గాని సమాధినేగాని ముట్టినవాని విూదను దానిని ప్రోక్షింపవలెను. | 19 మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని విూద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. | 20 అపవిత్రుడు పాపశుద్ధి చేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానివిూద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు. | 21 వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. | 22 దాని ముట్టు మనుష్యులందరు సాయంకాలము వరకు అపవిత్రులై యుందురు.

Previous