BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 11 అధ్యాయము  

11 జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములోనొక కొనను దహింపసాగెను. | 2 జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. | 3 యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా1 అను పేరు పెట్టబడెను. | 4 వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి- మాకెవరు మాంసము పెట్టెదరు? | 5 ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. | 6 ఈ మన్నా కాక మా కన్నుల యెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి. | 7 ఆ మన్నా కొతిమెర గింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను. | 8 జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము విూద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను. | 9 రాత్రియందు మంచు పాళెము విూద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. | 10 జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను. | 11 కాగా మోషే యెహోవాతో యిట్లనెను-నీవేల నీ సేవకుని బాధించితివి? నావిూద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నావిూద పెట్టనేల? | 12 నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణ పూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. | 13 ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు -తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. | 14 ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము. | 15 నావిూద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. | 16 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను-జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి డెబ్బదిమంది మనుష్యులను నా యొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడ నిలువబడవలెను. | 17 నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీ విూద వచ్చిన ఆత్మలో పాలు వారి విూద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడ భరింపవలెను. | 18 నీవు జనులను చూచి యిట్లనుము-మిమ్మును విూరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; విూరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి-మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని విూరు చెప్పుకొంటిరి గనుక యెహోవా విూకు మాంసమిచ్చును, విూరు తిందురు. | 19 ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు. | 20 ఒక నెల దినముల వరకు, అనగా అది విూ నాసికా రంధ్రములలో నుండి వచ్చి విూకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు; ఏలయనగా విూరు విూ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి-ఐగుప్తులో నుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి. | 21 అందుకు మోషే-నేను ఈ జనుల మధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులు-వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితిని. | 22 వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొఱ్ఱెలను పశువులను చంప వలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారి నిమిత్తము కూర్చవలెనా? అనెను. 23 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను- యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరువేరునో లేదో యిప్పుడు చూచెదవు. | 24 మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలో నుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారము చుట్టు వారిని నిలువబెట్టగా | 25 యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని విూద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దల విూద ఉంచెను; కావున ఆ ఆత్మ వారి విూద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు. | 26 ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి విూదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడిన వారి లోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి. | 27 అప్పుడు ఒక యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తి వచ్చి-ఏల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా | 28 మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడు మోషేకు పరిచారకుడునైన యెహోషువ-మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. | 29 అందుకు మోషే-నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారివిూద ఉంచును గాక అని అతనితో అనెను. | 30 అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి. | 31 తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమివిూద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను. | 32 కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొను చుండిరి; తక్కువ కూర్చుకొనిన వాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి. | 33 ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలక మునుపే, యెహోవా కోపము జనుల విూద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. | 34 మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా2 అను పేరు పెట్టబడెను. | 35 జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమై పోయి హజేరోతులో దిగిరి.

1. మంట. 2. దురాశ
Previous