BLM
 

 
Previous
  లేవీయకాండము 25 అధ్యాయము  

25 మరియు యెహోవా సీనాయి కొండవిూద మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము -నేను విూకిచ్చుచున్న దేశములోనికి విూరు వచ్చిన తరువాత ఆ భూమి కూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను. | 3 ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. | 4 ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. | 5 నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము. | 6 అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. | 7 మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. | 8 మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును. | 9 ఏడవ నెల పదియవనాడు విూ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థదినమున విూ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను. | 10 విూరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి విూ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది విూకు సునాదముగా1 నుండును; అప్పుడు విూలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. | 11 ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్సరము విూకు సునాదకాలము. అందులో విూరు విత్తకూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. | 12 అది సునాద కాలము; అది విూకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను విూరు తినెదరు. | 13 ఆ సునాద సంవత్సరమున విూలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను. | 14 నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములోకాని విూరు ఒకరినొకరు బాధింపకూడదు. | 15 సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగువానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. | 16 ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెను గదా. | 17 విూరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను విూ దేవుడనైన యెహోవాను. | 18 కాబట్టి విూరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను. | 19 అప్పుడు విూరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, విూరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. | 20 ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో. | 21 అయితే నేను ఆరవ యేట నా దీవెన విూకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను విూకు కలుగజేయును. | 22 విూరు ఎనిమిదవ సంవత్స రమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. | 23 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, విూరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. | 24 విూ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను. | 25 నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సవిూప బంధువుడు విడిపింప వచ్చిన యెడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. | 26 అయితే ఒకడు సవిూప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన యెడల | 27 దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. | 28 అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును. | 29 ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాస గృహమును అమ్మిన యెడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును. | 30 అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని యెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. | 31 చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలి పొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాద కాలములో తొలగిపోవును. | 32 అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. | 33 లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ద ఇల్లు సంపాదించిన యెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. | 34 వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. | 35 పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీ వలన బ్రదుకవలెను. | 36 నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డినైనను తీసికొనకూడదు; నీ సహోదరుడు నీ వలన బ్రదుకవలెను. | 37 నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు. | 38 నేను విూకు కనాను దేశమునిచ్చి విూకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన విూ దేవుడనైన యెహోవాను. | 39 నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన యెడల వానిచేత బానిస సేవ చేయించుకొనకూడదు. | 40 వాడు జీతగానివలెను పరవాసివలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. | 41 అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను. | 42 ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు; | 43 నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకుము. | 44 విూ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. | 45 మరియు విూ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు విూ సొత్తగుదురు. | 46 విూ తరువాత విూ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు విూరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా విూకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన విూరు సహోదరులు గనుక ఒకనిచేత ఒకడు కఠిన సేవ చేయించు కొనకూడదు. | 47 పరదేశియేగాని నీ యొద్ద నివసించువాడేగాని ధనసంపాదనము చేసికొనునప్పుడు అతని యొద్ద నివసించు నీ సహో దరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన యెడల | 48 తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. | 49 వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. | 50 అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. | 51 ఇంక అనేక సంవత్సరములు మిగిలి యుండిన యెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను. | 52 సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన యెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. | 53 ఏటేటికి జీతగానివలె వాడతని యొద్ద ఉండవలెను. అతడు విూ కన్నుల యెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు. | 54 అతడు ఈ రీతిగా విడిపింపబడని యెడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును. | 55 ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను విూ దేవుడనైన యెహోవాను.

Previous