BLM
 

 
Previous
  లేవీయకాండము 14 అధ్యాయము  

14 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను. | 3 యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల | 4 యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. | 5 అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పకక్షులలో ఒక దానిని చంపనాజ్ఞాపించి | 6 సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షినిముంచి | 7 కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వానివిూద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. | 8 అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెము లోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను. | 9 ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. | 10 ఎనిమిదవనాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొని రావలెను. | 11 పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొని రావలెను. | 12 అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. | 13 అతడు పాపపరిహారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలెను. పాపపరిహారార్థమైన దానివలె అపరాధపరి హారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము. | 14 అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్ధమైనదాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనవిూదను, వాని కుడిచేతి బొటనవ్రేలి విూదను, వాని కుడికాలి బొటనవ్రేలి విూదను, దానిని చమరవలెను. | 15 మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను. | 16 అప్పుడు యాజకుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. | 17 యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనవిూదను, వాని కుడిచేతి బొటనవ్రేలి విూదను, వాని కుడికాలి బొటనవ్రేలి విూదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువు యొక్క రక్తము విూద చమరవలెను. | 18 అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరువాని తలవిూద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. | 19 అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను. | 20 యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము విూద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. | 21 వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱెపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను | 22 వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను. | 23 వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసికొని రావలెను.| 24 యాజకుడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. | 25 అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధపరిహారార్థబలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనవిూదను, వాని కుడిచేతి బొటన వ్రేలివిూదను, వాని కుడికాలి బొటనవ్రేలి విూదను దానిని చమరవలెను. | 26 మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పొసికొని | 27 తన యెడమ చేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడుమారులు ప్రోక్షింపవలెను. | 28 మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనవిూదను, వాని కుడిచేతి బొటనవ్రేలి విూదను, వాని కుడికాలి బొటన వ్రేలివిూదను ఆ అపరాధపరిహారార్థ బలిపశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. | 29 యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలవిూద పోయవలెను. | 30 అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపు పిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను. | 31 తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒక దానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. | 32 కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధి యిదే. | 33 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను | 34 -నేను స్వాస్థ్యముగా విూకిచ్చుచున్న దేశమునకు విూరు వచ్చిన తరువాత, విూ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసిన యెడల | 35 ఆ యింటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి-నా యింటిలో కుష్ఠుపొడవంటిది నాకు కనబడెనని అతనికి తెలియచెప్పవలెను. | 36 అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. | 37 అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల | 38 యాజకుడు ఆ యింటనుండి యింటి వాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను. | 39 ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల | 40 యాజకుని సెలవు చొప్పున ఆ పొగల రాళ్ళను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. | 41 అప్పుడతడు ఆ యింటి లోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి | 42 వేరు రాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను. | 43 అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడిన యెడల | 44 యాజకుడు వచ్చి దాని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించిన యెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. | 45 కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. | 46 మరియు ఆ యిల్లు పాడు విడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. | 47 ఆ యింట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. | 48 యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయిన యెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. | 49 ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని | 50 పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పకక్షులలో ఒక దానిని వధించి | 51 ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటి విూద ఏడుమారులు ప్రోక్షింపవలెను. | 52 అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను. | 53 అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. | 54 ప్రతి విధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు | 55 వస్త్రకుష్ఠమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమును గూర్చియు | 56 వాపును గూర్చియు, పక్కును గూర్చియు నిగనిగలాడు మచ్చను గూర్చియు, | 57 ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.

Previous