BLM
 

 
Previous
  లేవీయకాండము 13 అధ్యాయము  

13 మరియు యెహోవా మోషేకు అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను | 2 -ఒకని దేహచర్మమందు వాపుగాని పొక్కుగాని నిగనిగలాడు మచ్చగానియుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడిన యెడల యాజకుడైన అహరోనునొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను. | 3 ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారిన యెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడిన యెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. | 4 నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లము కాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడిన యెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. | 5 ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మ మందు వ్యాపింపక అట్లే ఉండిన యెడల, యాజకుడు మరి ఏడు దినములు వాని కడగా ఉంచవలెను. | 6 ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన యెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే; వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. | 7 అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. | 8 అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన యెడల యాజ కుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. | 9 కుష్ఠుపొడ యొకనికి కలిగిన యెడల యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను. | 10 యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన యెడల, అది వెండ్రుకలను తెల్లబారిన యెడలను, వాపులో పచ్చి మాంసము కనబడిన యెడలను, | 11 అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అపవిత్రుడు. | 12 కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగలవాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండిన యెడల | 13 యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించిన యెడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు. | 14 అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. | 15 యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే; అది కుష్ఠము. | 16 అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకుని యొద్దకు రావలెను; | 17 యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన యెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు. | 18 ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత| 19 ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపు రంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన యెడల, యాజకునికి దాని కనుపరచవలెను. | 20 యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడిన యెడలను, దాని వెండ్రుకలు తెల్లబారి యుండిన యెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటి వలన పుట్టిన కుష్ఠుపొడ. | 21 యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయిన యెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడిన యెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. | 22 అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ. | 23 నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన యెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రు డని నిర్ణయింపవలెను. | 24 దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండిన యెడల | 25 యాజకుడు దాని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారిన యెడలను, అది చర్మము కంటె పల్లముగా కనబడిన యెడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను; అది కుష్ఠము. | 26 యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మము కంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన యెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను. | 27 ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే. | 28 అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడిన యెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే. | 29 పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన యెడల, యాజకుడు ఆ పొడను చూడగా | 30 అది చర్మముకంటె పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన యెడల, వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలవిూదనేమి గడ్డము విూదనేమి పుట్టిన కుష్ఠము. | 31 యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచినప్పుడు అది చర్మము కంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేని యెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగల వానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. | 32 ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక యుండిన యెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రుకలు లేని యెడలను, చర్మము కంటె పల్లముకాని యెడలను, | 33 వాడు క్షౌరము చేసికొనవలెనుగాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. | 34 ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటె పల్లముకాక యుండిన యెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. | 35 వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల | 36 యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించియుండిన యెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు. | 37 అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. | 38 మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన యెడల | 39 యాజకుడు వానిని చూడవలెను; వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండిన యెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు. | 40 తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయినను వాడు పవిత్రుడు. | 41 ముఖము వైపున తలవెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు. | 42 అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టిన యెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్ఠము. | 43 యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మ మందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైన యెడల | 44 వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది. | 45 ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని-అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. | 46 ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. | 47 మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱె వెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి | 48 నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి | 49 ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడిన యెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను. | 50 యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. | 51 ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించిన యెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. | 52 కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను. | 53 అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన యెడల | 54 యాజకుడు ఆ పొడగల దానిని ఉదుకనాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను. | 55 ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. | 56 యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండిన యెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. | 57 అటు తరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడిన యెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. | 58 ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను; అప్పుడు అది పవిత్రమగును. | 59 బొచ్చు బట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలు వస్తువుయందేగాని యుండు కుష్ఠు పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణ యింపవలసిన విధి యిదే.

Previous