|
||
| Previous | ||
| లేవీయకాండము 10 అధ్యాయము | ||
10 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి విూద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా | 2 యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతిబొందిరి. | 3 అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను-ఇది యెహోవా చెప్పిన మాట- నాయొద్ద నుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరి యెదుట నన్ను మహిమపరచు కొందును. అహరోను మౌనముగానుండగా | 4 మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మిషా యేలును ఎల్సాఫానును పిలిపించి-విూరు సవిూపించి పరి శుద్ధస్థలము నెదుట నుండి పాళెము వెలుపలికి విూ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను. | 5 మోషే చెప్పినట్లు వారు సవిూపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి. | 6 అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియా జరు ఈతామారును వారితో-విూరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజము విూద ఆగ్రహపడకుండు నట్లును, విూరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు విూ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటి వారందరు ఏడవవచ్చును. | 7 యెహోవా అభిషేక తైలము విూ విూద నున్నది గనుక విూరు చావకుండునట్లు విూరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్లకూడ దనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. | 8-9 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను-విూరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు విూరు చావ కుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు. | 10 విూరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానినుండి పవిత్రమైన దానిని వేరుచేయుటకును, | 11 యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధు లను విూరు వారికి బోధించుటకును ఇది విూ తరతరములకు నిత్యమైన కట్టడ. | 12 అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను- విూరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్య మును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.| 13 కావున విూరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని. | 14 మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను విూరు, అనగా నీవును నీతో పాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తిన వలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలో నుండి నీకును నీ కుమారులకును నియ మింపబడిన వంతులు. | 15 హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. | 16 అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారును వారివిూద ఆగ్రహపడి | 17 విూరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థ బలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధము గదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని విూకిచ్చెను గదా. | 18 ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలము లోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయ ముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను. | 19 అందుకు అహరోను మోషేతో-ఇదిగో నేడు పాప పరిహారార్ధ బలిపశువును దహనబలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన యెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. | 20 మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. |
||
| Previous | ||