4 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము- యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల, ఎట్లనగా | 3 -ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన యెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. | 4 అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొని వచ్చి కోడె తలవిూద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. | 5 అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. | 6 ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డ తెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. | 7 అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల విూద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. | 8 మరియు అతడు పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల విూది క్రొవ్వంతటిని | 9 మూత్ర గ్రంధులను వాటివిూది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంధుల పైనున్న కాలేజమువిూది వపను | 10 సమాధాన బలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠము విూద వాటిని ధూపము వేయవలెను. | 11 ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ | 12 పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెల విూద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను. |
13 ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదము చేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను విూరి చేయరాని పని చేసి అపరాధులైన యెడల | 14 వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియ బడునప్పుడు, సంఘము పాపపరిహారార్థబలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను. | 15 సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెవిూద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. | 16 అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారము లోనికి తీసికొని రావలెను. | 17 ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను. | 18 మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల విూద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. | 19 మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము విూద దహింపవలెను. | 20 అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. | 21 ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి. | 22 అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను విూరి చేయరాని పనులు చేసి అపరాధియైన యెడల | 23 అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడిన యెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి | 24 ఆ మేకపిల్ల తలవిూద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాపపరిహారార్థబలి. | 25 యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ముల విూద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను. | 26 సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠము విూద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. | 27 విూ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను విూరి అపరాధియైన యెడల | 28 తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి | 29 పాపపరిహారార్థబలి పశువు యొక్క తల విూద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. | 30 యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ముల విూద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. | 31 మరియు సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము విూద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. | 32 ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱెను తీసికొని వచ్చిన యెడల నిర్దోషమైనదాని తీసి కొనివచ్చి | 33 పాపపరిహారార్థబలియగు ఆ పశువు తలవిూద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థబలియగు దాని వధింపవలెను. | 34 యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ముల విూద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. | 35 మరియు సమాధానబలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము విూద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. |