BLM
 

 
Previous
  ఆదికాండము 49 అధ్యాయము  

49 యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను- విూరు కూడి రండి, అంత్య దినములలో విూకు సంభవింపబోవు సంగతులను విూకు తెలియచేసెదను.
2 యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి
విూ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.
3 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు
నా శక్తియు నా బలము యొక్క ప్రధమ ఫలమును
ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
4 నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు
నీ తండ్రి మంచము విూద కెక్కితివి
దానిని అపవిత్రము చేసితివి
అతడు నా మంచము విూదికెక్కెను.
5 షిమ్యోను లేవి అనువారు సహోదరులు
వారి ఖడ్గములు బాలాత్కారపు ఆయుధములు.
6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు
నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు
వారు, కోపము వచ్చి మనుష్యులను చంపిరి
తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి.
7 వారి కోపము వేండ్రమైనది
వారి ఉగ్రతయు కఠినమైనది
అవి శపింపబడును
యాకోబులో వారిని విభజించెదను
ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
8 యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు
నీ చెయ్యి నీ శత్రువుల మెడ విూద ఉండును
నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
9 యూదా కొదమ సింహము
నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి
సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను
అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను
అతని లేపువాడెవడు?
10 షిలోహు వచ్చు వరకు1
యూదా యొద్ద నుండి దండము తొలగదు
అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు
ప్రజలు అతనికి విధేయులై యుందురు.
11 ద్రాక్షావల్లికి తన గాడిదను
ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి
ద్రాక్షారసములో తన బట్టలను
ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
12 అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను
అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
13 జెబూలూను సముద్రపు రేవున నివసించును
అతడు ఓడలకు రేవుగా ఉండును
అతని పొలిమేర సీదోను వరకు నుండును.
14 ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను
పండుకొనియున్న బలమైన గార్ధభము.
15 అతడు విశ్రాంతి మంచిదగుటయు
ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక
అతడు మోయుటకు భుజము వంచుకొని
వెట్టిచేయు దాసుడగును.
16 దాసు ఇశ్రాయేలు గోత్రికులవలె
తన ప్రజలకు న్యాయము తీర్చును
17 దాను త్రోవలో సర్పముగాను
దారిలో కట్లపాముగాను ఉండును.
అది గుఱ్ఱపు మడిమెలు కరచును
అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
18 యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి యున్నాను.
19 బంటుల గుంపు గాదును కొట్టును
అతడు మడిమెను కొట్టును.
20 ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు
రాజులకు తగిన మధుర పదార్ధములను అతడిచ్చును.
21 నఫ్తాలి విడువబడిన లేడి
అతడు ఇంపైన మాటలు పలుకును.
22 యోసేపు ఫలించెడి కొమ్మ
ఊట యొద్ద ఫలించెడి కొమ్మ
దాని రెమమలు గోడ విూదికి ఎక్కి వ్యాపించును.
23 విలుకాండ్రు అతని వేదించిరి
వారు బాణములను వేసి అతని హింసించిరి.
24 యాకోబు కొలుచు పరాక్రమశాలియైన వాని హస్త బలము వలన
అతని విల్లు బలమైనదగును
ఇశ్రాయేలునకు బండయు
మేపెడివాడును ఆయనే.
నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను
పై నుండి మింటి దీవెనలతోను
25 క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోను
స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను
నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను
అతని బాహు బలము దిట్టపరచబడును
26 నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని
చిరకాల పర్వతము కంటె హెచ్చుగ ప్రబలమగును.
అవి యోసేపు తలవిూదను
తన సహోదరుల నుండి వేరుపరచబడిన
వాని నడినెత్తి విూదను ఉండును.
27 బెన్యావిూను చీల్చునట్టి తోడేలు
అతడు ఉదయమందు ఎరను తిని
అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును.

28 ఇవి అన్నియు ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. | 29 తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను-నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. | 30 హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. | 31 అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతిపెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. | 32 ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. | 33 యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచము విూద తన కాళ్లు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను.

1. లేక, అతడు షిలోహుకు వచ్చువరకు.
Previous