BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 18 అధ్యాయము  

18 యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయుల కందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు; అది వారి హక్కు. | 2 వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱెగాని మేకగాని బలిగా అర్పించువారి వలన | 3 యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను. | 4 నీ ధాన్యములోను నీ ద్రాక్షారములోను నీ నూనెలోను ప్రధమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను. | 5 నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు. | 6 ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు | 7 అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. | 8 అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను. | 9 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. | 10 తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను | 11 కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను విూ మధ్య ఉండనియ్యకూడదు. | 12 వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు. | 13 నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై యుండవలెను. | 14 నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు. | 15 హోరేబులో ఆ సమాజదినమున నీవు-నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, | 16 ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. | 17 మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; | 18 వారి సహో దరులలో నుండి నీవంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. | 19 అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. | 20 అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామ మున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. | 21 మరియు -ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని విూరనుకొనిన యెడల, | 22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరక పోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు.

Previous