|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 15 అధ్యాయము | ||
15 ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువురీతి యేదనగా | 2 తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్భంధింపకూడదు. | 3 అన్యుని నిర్భంధిపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. | 4 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. | 5 కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న యీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల విూలో బీదలు ఉండనే ఉండరు. | 6 ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పు చేయవు; అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. | 7 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయము కఠినపరచు కొనకూడదు. | 8 నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కర చొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. | 9 విడుదల సంవత్సరమైన యేడవ సంవత్సరము సవిూపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరుని యెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయిన యెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును. | 10 నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. | 11 బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను-నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. | 12 నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన యెడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. | 13 అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. | 14 నీవు ఐగుప్తుదేశములో దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వానికియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను. | 15 ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీ కాజ్ఞాపించియున్నాను. | 16 అయితే నీయొద్ద వానికి మేలు కలిగినందున-నిన్నును నీ యింటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీయొద్ద నుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పిన యెడల | 17 నీవు కదురును పట్టుకొని, తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై యుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. | 18 వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. 19 నీ గోవులలోనేమి నీ గొఱ్ఱె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱెమేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. | 20 యెహోవా యేర్పరచుకొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను. | 21 దానిలో లోపము, అనగా దానికి కుంటితమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన యెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు. | 22 జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమివిూద దాని పారబోయవలెను. |
||
| Previous | ||