BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 7 అధ్యాయము  

7 నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుట నుండి వెళ్లగొట్టిన తరువాత | 2 నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు, | 3 నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. | 4 నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు; అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీ విూద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. | 5 కావున విూరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. | 6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమివిూదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. | 7 విూరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటె విూరు లెక్కకు తక్కువే గదా. | 8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను విూ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండియు మిమ్మును విడిపించెను. | 9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగ ముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను. | 10 ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. | 11 కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను విూరనుసరించి నడుచు కొనవలెను. 12 విూరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచు కొనిన యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. | 13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్య మును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును. | 14 సమస్త జనముల కంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికేగాని ఆడు దానికేగాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైన నుండదు. | 15 యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరి విూదికే వాటిని పంపించును. | 16 మరియు నీ దేవు డైన యెహోవా నీకప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏల యనగా అది నీకు ఉరియగును. | 17 ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగల నని నీవనుకొందువేమో, వారికి భయపడకుము. | 18 నీ దేవు డైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించి నప్పుడు | 19 నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును. | 20 మరియు మిలిగిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి విూదికి పెద్ద కందిరీగలను పంపును. | 21 వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్య నున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు. | 22 నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు, అది నీకు క్షేమ కరము కాదు. | 23 అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్లచేయును. | 24 ఆయన వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేకపోవును. | 25 వారి దేవతల ప్రతిమలను విూరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి విూదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కబడుదువేమో గనుక దానిని తీసికొన కూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. | 26 దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీ యింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.

Previous