BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 5 అధ్యాయము  

5 మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను-ఇశ్రాయేలీయులారా, నేను విూ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటి ననుసరించి నడువుడి. | 2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. | 3 యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను. | 4 యెహోవా ఆ కొండవిూద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా విూతో మాటలాడగా విూరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు. | 5 గనుక యెహోవా మాట విూకు తెలియజేయుటకు నేను యెహోవాకును విూకును మధ్యను నిలిచియుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను. | 6 -దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. | 7 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. | 8 పైనున్న ఆకాశమందేగాని, క్రిందనున్న భూమియందేగాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని, యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. | 9 వాటికి నమస్కరింపకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల విూదికి రప్పించుచు | 10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో వేయి తరముల వరకు కరుణించువాడనై యున్నాను. | 11 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్ధముగా ఉచ్ఛరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్ధముగా ఉచ్ఛరించు వానిని నిర్దోషిగా ఎంచడు. | 12 నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. | 13 ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. | 14 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. | 15 నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడ నుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. 16 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.
17 నరహత్య చేయకూడదు.
18 వ్యభిచరింపకూడదు.
19 దొంగిలకూడదు.
20 నీ పొరుగు వానివిూద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు.
21 నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగు వాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
22 ఈ మాటలను యెహోవా ఆ పర్వతము విూద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో విూ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకల విూద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్ప లేదు. | 23 మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని విూరు, అనగా విూ గోత్రముల ప్రధానులును విూ పెద్దలును నా యొద్దకు వచ్చి | 24 -మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్య మును మాకు చూపించెను. అగ్ని మధ్యనుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి. | 25 కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన యెడల చనిపోదుము. | 26 మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్యనుండి పలుకుట విని బ్రదికెను? | 27 నీవే సవిూపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి. | 28 విూరు నాతో మాటలాడినప్పుడు యెహోవా విూ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను-ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని యున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. | 29 వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. | 30 -విూ గుడారములలోనికి తిరిగి వెళ్లుడని నీవు వారితో చెప్పుము. | 31 అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను. | 32 వారు స్వాధీనపరచుకొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు ఆలాగు ప్రవర్తింపవలెను. | 33 కాబట్టి విూరు కుడికే గాని యెడమకే గాని తిరుగక విూ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. విూరు స్వాధీన పరచుకొనబోవు దేశములో విూరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు విూ దేవుడైన యెహోవా విూకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.

Previous