BLM
 

 
Previous
  లేవీయకాండము 21 అధ్యాయము  

21 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. | 2 యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము-విూలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సవిూప రక్తసంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, | 3 తనకు సవిూపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. | 4 అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసికొనరాదు. | 5 వారు తమ తలలు బోడి చేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు. | 6 వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను. | 7 వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినేగాని పెండ్లి చేసికొనకూడదు, పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. | 8 అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు విూ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. | 9 మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొనిన యెడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. | 10 ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలవిూద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్ర ములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు; | 11 అతడు శవము దగ్గరకు పోరాదు; తన తండ్రి శవము వలననేగాని తన తల్లి శవము వలననేగాని తన్ను అపవిత్రపరచుకొన రాదు. | 12 దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని విూద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు; నేను యెహోవాను. | 13 అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను. | 14 విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లిచేసికొనవలెను. | 15 యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. | 16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 17 -నీవు అహరోనుతో ఇట్లనుము-నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సవిూపింపకూడదు. | 18 ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవయవములుగలవాడేగాని | 19 కాలైనను చేయినైనను విరిగినవాడే గాని | 20 గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గలవాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సవిూపింపకూడదు. | 21 యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సవిూపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సవిూపింపకూడదు. | 22 అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. | 23 మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెర యెదుటికి చేరకూడదు; బలిపీఠమును సవిూపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

Previous