BLM
 

 
Previous
  ఆదికాండము 42 అధ్యాయము  

42 ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు-విూరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. | 2 మరియు అతడు- చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకునట్లు విూరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా | 3 యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. | 4 అయినను-ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యావిూనును అతని అన్నలతో పంపినవాడు కాడు. | 5 కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి. | 6 అప్పుడు యోసేపు ఆ దేశమంతటి విూద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. | 7 యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి-విూరెక్కడి నుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు-ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమనిరి. | 8 యోసేపు తన సహోదరులను గురుతుపట్టెను గాని వారతని గురుతు పట్టలేదు. | 9 యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని-విూరు వేగుల వారు, ఈ దేశము గుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా | 10 వారు-లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి; | 11 మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్ధవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. | 12 అయితే అతడు-లేదు, ఈ దేశము గుట్టు తెలిసికొనుటకై వచ్చితిరని వారితో అనెను. | 13 అందుకు వారు- నీ దాసులమైన మేము పన్నెండుమంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. | 14 అయితే యోసేపు- విూరు వేగులవారని నేను విూతో చెప్పిన మాట నిజమే. | 15 దీని వలన విూ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, విూ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని విూరిక్కడ నుండి వెళ్లకూడదు. | 16 విూ తమ్ముని తీసికొని వచ్చుటకు విూలో ఒకని పంపుడి; అయితే విూరు బంధింపబడి యుందురు. అట్లు విూలో సత్యమున్నదో లేదో విూ మాటలు శోధింపబడును; లేని యెడల ఫరో జీవముతోడు, విూరు వేగులవారని చెప్పి | 17 వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను. 18 మూడవ దినమున యోసేపు వారిని చూచి-నేను దేవునికి భయపడువాడను; విూరు బ్రతుకునట్లు దీని చేయుడి. | 19 విూరు యథార్ధవంతులైతిరా విూ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; విూరు వెళ్లి విూ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి. | 20 విూ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు విూ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక విూరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. | 21 అప్పుడు వారు-నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. | 22 మరియు రూబేను -ఈ చిన్నవాని యెడల పాపము చేయకుడని నేను విూతో చెప్పలేదా? అయినను విూరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన విూద మోపబడుచున్నదని వారి కుత్తరమిచ్చెను. | 23 అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు. | 24 అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారి యొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. | 25 మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్ధములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి యెడల నిట్లు జరిగించెను. | 26 వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల విూద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్లిపోయిరి. | 27 అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను. | 28 అప్పుడతడు-నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదరిపోయినవారై జడిసి-ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. | 29 వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి. | 30 ఎట్లనగా-ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకొనెను. | 31 అప్పుడు-మేము యథార్ధ వంతులము, వేగులవారము కాము. | 32 పన్నెండుమంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. | 33 అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి-విూరు యథార్ధవంతులని దీని వలన నేను తెలిసికొందును. విూ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి విూ కుటుంబమునకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి, | 34 నా యొద్దకు ఆ చిన్నవాని తోడుకొని రండి. అప్పుడు విూరు యథార్ధవంతులే గాని వేగుల వారు కారని నేను తెలిసికొని విూ సహోదరుని విూకప్పగించెదను; అప్పుడు విూరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి. | 35 వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. | 36 అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి- విూరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; విూరు బెన్యావిూనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. | 37 అందుకు రూబేను-నేనతని నీ యొద్దకు తీసికొని రాని యెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీ యొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. | 38 అయితే అతడు-నా కుమారుని విూతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. విూరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.

Previous