BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము  

33 దైవజనుడైన మోషే మృతినొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను-
2 యెహోవా సీనాయి నుండి వచ్చెను
శేయీరులో నుండి వారికి ఉదయించెను
ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను
వేవేల పరిశుద్ధ సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను
ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు చుండెను.
3 ఆయన జనములను ప్రేమించును
ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు
వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు
నీ ఉపదేశమును అంగీకరింతురు.
4 మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను
అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
5 జనులలో ముఖ్యులును ఇశ్రాయేలు గోత్రములును కూడగా
అతడు యెషూరూనులో రాజు ఆయెను.
6 రూబేను బ్రదికి చావక యుండునుగాక
అతని వారు లెక్కింపలేనంతమంది1 అగుదురు.
7 యూదాను గూర్చి అతడిట్లనెను-
యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము.
యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.
8 లేవిని గూర్చి యిట్లనెను-
నీ తువ్మిూము నీ ఊరీము నీ భక్తునికి కలవు
మస్సాలో నీవు అతని పరిశోధించితివి
మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి.
9 అతడు-నేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు
తన తల్లిని గూర్చియు అనెను
తన సహోదరులను లక్ష్యపెట్టలేదు
తన కుమారులను కుమారులని యెంచలేదు
వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.
10 వారు యాకోబునకు నీ విధులను
ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు
నీ సన్నిధిని ధూపమును
నీ బలిపీఠము విూద సర్వాంగబలిని అర్పించుదురు.
11 యెహోవా, అతని బలమును అంగీకరించుము
అతడు చేయు కార్యమును అంగీకరించువిూ
అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు
వారి నడుములను విరుగగొట్టుము.
12 బెన్యావిూనును గూర్చి యిట్లనెను-
బెన్యావిూను యెహోవాకు ప్రియుడు
ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును
దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును
ఆయన భుజముల మధ్య2 అతడు నివసించును.
13 యోసేపును గూర్చి యిట్లనెను-
ఆకాశ పరమార్థముల వలన మంచువలన
క్రింద క్రుంగియున్న అగాధ జలముల వలన
14 సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్ధముల వలన
చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్ధముల వలన
15 పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్ధముల వలన
నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్ధముల వలన
16 సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్ధ ముల వలన
యెహోవా అతని భూమిని దీవించును
పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల విూదికి వచ్చును
తన సహోదరులలో ప్రఖ్యాతి నొందినవాని నడినెత్తి విూదికి అది వచ్చును.
17 అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు.
అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు
వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును
ఎఫ్రాయిము యొక్క పదివేలును మనష్షే యొక్క వేలును ఆలాగున నుందురు.
18 జెబూలూనును గూర్చి యిట్లనెను-
జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము
ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.
19 వారు జనములను కొండకు పిలిచిరి
అక్కడ నీతి బలుల నర్పింతురు
వారు సముద్రముల సమృద్ధిని
ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు.
20 గాదును గూర్చి యిట్లనెను-
గాదును విశాలపరచువాడు స్తుతింపబడును
అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును.
21 అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను
అక్కడ నాయకుని భాగము కాపాడబడెను.
అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను
యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను
ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచ రించెను.
22 దానును గూర్చి యిట్లనెను-
దాను సింహపు పిల్ల
అది బాషాను నుండి దుమికి దాటును.
23 నఫ్తాలిని గూర్చి యిట్లనెను-
కటాక్షము చేత తృప్తిపొందిన నఫ్తాలి,
యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి,
పశ్చిమ1 దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.
24 ఆషేరును గూర్చి యిట్లనెను-
ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును
అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును
తన పాదములను తైలములో ముంచుకొనును.
25 నీ కమ్ములు2 ఇనుపవియు ఇత్తడివియునై యుండును.
నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి3 కలుగును.
26 యెషూరూనూ, దేవుని పోలిన వాడెవడును లేడు
ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును
మహోన్నతుడై మేఘవాహనుడగును.
27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము
నిత్యముగ నుండు బాహువులు నీ క్రిందనుండును
ఆయన నీ యెదుట నుండి శత్రువును వెళ్లగొట్టి- నశింపజేయుమనెను.
28 ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును
యాకోబు ఊట ప్రత్యేకింపబడును
అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును
అతనిపై ఆకాశము మంచును కురిపించును.
29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు?
ఆయన నీకు సహాయకరమైన కేడెము
నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము
నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు.

1. లేక, సముద్రము. 2. పాదరక్షలు. 3. లేక, బలము.
Previous