BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము  

31 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను-నేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను. | 2 ఇకవిూదట నేను వచ్చుచు పోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. | 3 నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. | 4 యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే యీ జనములకును చేయును. | 5 నేను విూ కాజ్ఞాపించిన దానినంతటినిబట్టి విూరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి | 6 భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు. | 7 మరియు మోషే యెహోషువను పిలిచి-నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజల కిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను. | 8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకు మని ఇశ్రాయేలీయులందరి యెదుట అతనితో చెప్పెను. | 9 మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దానినప్పగించి | 10 వారితో ఇట్లనెను-ప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున | 11 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. | 12 విూ దేవు డైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యము లన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషలేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. | 13 ఆలాగు నేర్చుకొనిన యెడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని, విూరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశమున విూరు బ్రదుకు దినములన్నియు విూ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. | 14 మరియు యెహోవా-చూడుము; నీ మరణ దినములు సవిూపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా, | 15 మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా | 16 యెహోవా మోషేతో యిట్లనెను-ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను విూరుదురు. | 17 కావున నా కోపము ఆ దినమున వారివిూద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు. | 18 వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. | 19 కాబట్టి విూరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల విూద నాకు సాక్ష్యార్ధముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. | 20 నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను విూరుదురు. | 21 విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి యెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారినోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే, నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను. | 22 కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. | 23 మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను- నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయు లను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడైయుందును. | 24 ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత | 25 మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా - విూరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని విూ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. | 26 అది అక్కడ నీ విూద సాక్ష్యార్ధముగా ఉండును. | 27 నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై విూతో ఉండగానే, ఇదిగో విూరు యెహోవా విూద తిరుగుబాటు చేసితిరి. | 28 నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. విూ గోత్రముల పెద్దలనందరిని విూ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారివిూద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. | 29 ఏలయనగా నేను మరణమైన తరువాత విూరు బొత్తిగా చెడిపోయి నేను విూకాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు విూకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. విూరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.

Previous