|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము | ||
28 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమివిూదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. | 2 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీ విూదికి వచ్చి నీకు ప్రాప్తించును. | 3 నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు; | 4 నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱెమేకల మందలు దీవింపబడును; | 5 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. | 6 నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు. | 7 నీవిూదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీ విూదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు. | 8 నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. | 9 నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. | 10 భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. | 11 మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. | 12 యెహోవా నీ దేశము విూద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. | 13 నేడు నేను విూకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికిగాని యెడమకుగాని తొలగి | 14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న యెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు. | 15 నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. | 16 పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; | 17 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; | 18 నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱెమేకల మందలు శపింపబడును; | 19 నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు శపింపబడుదువు. | 20 నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ విూదికి తెప్పించును. | 21 నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. | 22 యెహోవా క్షయరోగము చేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. | 23 నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును. | 24 యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును, నీవు నశించువరకు అది ఆకాశము నుండి నీ విూదికి వచ్చును. | 25 యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుట నుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు. | 26 నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. | 27 యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్ఠుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. | 28 వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును. | 29 అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును, | 30 స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. | 31 నీ యెద్దు నీ కన్నుల యెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుట నుండి బలాత్కారముచేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱెమేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు. | 32 నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచి చూచి క్షీణించిపోవునుగాని నీచేతనేమియు కాకపోవును. | 33 నీవెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. | 34 నీ కన్నుల యెదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెఱ్ఱియెత్తును. | 35 యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ల విూదను తొడల విూదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధిం చును. | 36 యెహోవా నిన్నును నీవు నీ విూద నియమించుకొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతి దేవతలను పూజించెదవు. | 37 యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు. | 38 విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలు దాని తినివేయును. | 39 ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును. | 40 ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవకాయలు రాలిపోవును. | 41 కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు. | 42 మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. | 43 నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు. | 44 అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు. | 45 నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నియు నీ విూదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు. | 46 మరియు అవి చిరకాలము వరకు నీ విూదను నీ సంతానము విూదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. | 47 నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు | 48 గనుక ఆకలిదప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ విూదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడవిూద ఇనుపకాడి యుంచుదురు. | 49 యెహోవా దూరమైయున్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, | 50 క్రూరముఖము కలిగి వృద్ధులను యౌవనస్థులను కటాక్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీవిూదికి రప్పించును. | 51 నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకలమందలనేగాని నీకు నిలువనియ్యరు. | 52 మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకు నీ దేశమం దంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. | 53 అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. | 54 విూలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరుని యెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల యెడలను చెడ్డదైనందున | 55 అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా విూ శత్రువులు విూ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలిన దేమియు ఉండదు. | 56-57 నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమియు లేకపోవుటచేత విూలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారముచేతను నేలవిూద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును. | 58 నీవు జాగ్రత్తపడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని యెడల | 59 యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును. | 60 నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ విూదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును. | 61 మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. | 62 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రములవలె విస్తారములైన విూరు, లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. | 63 కాబట్టి విూకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు విూ దేవుడైన యెహోవా విూయందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెల్లగింపబడుదువు. | 64 దేశము యొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. | 65 ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. | 66 నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును. | 67 నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున - అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున-అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. | 68 మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల విూద నిన్ను మరల రప్పించును. అక్కడ విూరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు. |
||
| Previous | ||