BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 25 అధ్యాయము  

25 మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చునప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చువలెను. | 2 ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన యెడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన యెదుట వాని కొట్టింపవలెను. | 3 నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటె విస్తారమైన దెబ్బలు కొట్టించిన యెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. | 4 నూర్చెడి యెద్దు1 మూతికి చిక్కము వేయకూడదు. | 5 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన యెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమె యెడల భర్త ధర్మము జరపవలెను. | 6 చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. | 7 అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని యెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దల యొద్దకు, పోయి- నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. | 8 అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడి-ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదనిన యెడల అతని సహోదరుని భార్య | 9 ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి-తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను. | 10 అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును. | 11 మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొనిన యెడల ఆమె చేతిని ఛేదింపవలెను. | 12 నీ కన్ను కటాక్షింపకూడదు. | 13 హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు. | 14 హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు. | 15 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. | 16 ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. | 17 విూరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి | 18 నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతము చేసెను. | 19 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండ చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.

1. కళ్లము త్రొక్కుచున్న.
Previous