|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయము | ||
24 ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసి కొనిన తరువాత ఆమెయందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె విూద అతనికి ఇష్టము తప్పిన యెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను. | 2 ఆమె అతని యింటనుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసికొనవచ్చును. | 3 ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింట నుండి ఆమెను పంపివేసిన యెడల నేమి, ఆమెను పెండ్లి చేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన యెడలనేమి | 4 ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు విూరు ఆలాగు చేయకూడదు. | 5 ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపార భారమును మోప కూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. | 6 తిరగటినైనను తిరగటి విూద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే. | 7 ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడిన యెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. ఆలాగు చేసిన యెడల ఆ చెడుతనమును విూ మధ్యనుండి పరిహరించుదురు. | 8 కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు విూకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారి కాజ్ఞాపించినట్లు చేయుటకు విూరు జాగ్రత్తగా నుండుడి. | 9 విూరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. | 10 నీ పొరుగు వానికి ఏదైనను నీవు ఎరువిచ్చిన యెడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు | 11 నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి యిచ్చును. | 12 ఆ మనుష్యుడు బీదవాడైన యెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను. | 13 అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును. | 14 నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడియ్యవలెను. | 15 సూర్యుడు అస్తమింపక మునుపు వానికియ్యవలెను. వాడు బీదవాడు గనుక దానివిూద ఆశ పెట్టుకొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టునేమో అది నీకు పాపమగును. | 16 కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. | 17 పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు. | 18 నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. | 19 నీ పొలములో నీ పంట కోయునప్పుడు పొల ములో ఒక పన మరచిపోయిన యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. | 20 నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. | 21 నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. | 22 నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటివని జ్ఞాపకము చేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను. |
||
| Previous | ||