BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 23 అధ్యాయము  

23 గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజములో చేరకూడదు. | 2 వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. | 3 అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. | 4 ఏలయనగా విూరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని1 పెతోరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. | 5 అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. | 6 నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. | 7 ఎదోవిూయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. | 8 వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును. | 9 నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్తపడవలెను. | 10 రాత్రి జరిగిన దానివలన మైలపడినవాడు విూలో ఉండిన యెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను. | 11 అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును. | 12 పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను. | 13 మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. | 14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు చుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. | 15 తన యజమానుని యొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. | 16 అతడు తన యిష్టప్రకారము నీ గ్రామములలో ఒకదాని యందు తాను ఏర్పరచుకొనిన చోట విూతో కలిసి విూ మధ్య నివసింపవలెను; నీవు వాని బాధింపకూడదు. | 17 ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా2 ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. | 18 పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. | 19 నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు. | 20 అన్యునికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచుకొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు. | 21 నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. | 22 నీవు మ్రొక్కుకొనని యెడల నీయందు ఆ పాపముండదు. | 23 నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. | 24 నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్షపండ్లు తిన వచ్చునుగాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు. | 25 నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చునుగాని నీ పొరుగువాని పంటచేనివిూద కొడవలి వేయకూడదు.

1. మెసిపొతేమియ. 2. దేవదాసి.
Previous